Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 22

రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః|
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ||

శ్లోకం అర్ధం : వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.

తాత్పర్యము : ఆత్మజ్ఞానమునొందిన వ్యక్తికి ఈ సంసార విషయములపై ధ్యాసే ఉండదు. ఏమి తినుచున్నాడో, త్రాగు చున్నాడో, ఏ వస్త్రములు ధరించుచున్నాడో కూడా అతనికి తెలియదు. ఆ స్థితిలో అతడు ఒక ఉన్మత్తుడువలె, బాలుడి వలె చూచు వారికి కనిపించును. చిరిగిన వస్త్రములతో, మాసిన ఆకృతితో అతడు కనిపించవచ్చును. దానికి కారణము వానికి ఈ సంసార విషయములపై ఏ మాత్రము ఆసక్తి లేకపోవుట. అట్టివానికి మనసు నిశ్చలమై, వ్యవహార ప్రపంచములో మంచి చెడులకు అతీతుడై వ్యవహరించును. మనసు నిర్మలమై, యోగములో నిమగ్నమై, ఆత్మానందమును చెందుచుండును. అన్ని ఆనందముల కన్ననూ మిన్నగు ఆత్మానందము ననుభవించుచూ అతడు పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువగా ఉండును.

No comments:

Post a Comment