Pages

Sunday, August 22, 2010

శ్లోకం - 1

భజగోవిన్దం భజగోవిన్దం
గోవిన్దం భజమూఢమతే|
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే||

శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

తాత్పర్యము : పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము, ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము. హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం. ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిదురించు చున్నా, క్రీడించు చున్నా మనసున హరి ధ్యానమును మరువకుడు.

శ్లోకం - 2

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||

శ్లోకం అర్ధం : ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

తాత్పర్యము : హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు కదా, ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మలవల్ల పాపపు మాటలు పెరిగి, అవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఎంతమందో కాలగర్భంలో కలిసి పోయారు. వారి పేర్లు, ఊర్లు కూడా ఎవరికీ తెలియదు. మరి త్యాగధనులు, భగవంతుడి భక్తుల పేర్లో, అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగులుట లేదా? కండ, అండ, ధన, మద బలంతో, మంచివారిని అణగ ద్రొక్కి, అధికార పగ్గాలు చేతబట్టి, అరాచకాలు సృష్టిస్తూ, ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో, అదే రీతిలో అకాల మరణాల పాలై, ఎంత దైన్యస్థితి నొందుచున్నారో! బ్రతికి ఉన్నా వారికి శాంతి లేదు, ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జెరుగుతుందో అని ప్రతిక్షణము భయపడుతూ బ్రతుకుతారు, అత్యంత హీనమైన చావు చస్తారు. కనుక, సంపాదనకు సమయము వృధా చేయక, హరి ధ్యానము పై మనసును మళ్ళించుము.

శ్లోకం - 3

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||

శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

తాత్పర్యము : స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. అందాలు అనుకొనే ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.

శ్లోకం - 4

నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||

శ్లోకం అర్ధం : తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

తాత్పర్యము : నావి అని భావించు ఈ బాహ్య వస్తువులే కాదు, ఈ శరీరము కూడా మన సొంతము కాదు. ఒక్క క్షణములో అవి మనలను వదిలి పోవును. తామరాకుపై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైనా అది జారిపోవును, నీటి బుడగలా రాలి పోవును. కనుక ఈ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక పడుట, ఎండమావుల వెనుక పడి దాహము తీర్చుకొన ప్రయత్నించిన దానితో సమానము. అందుకే పామరులు బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అనుబంధమును ఏర్పరుచుకొని, అవి ఉన్నంత వరకు సంతోషము, అవి దూరమైనప్పుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కావున, వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న దేహాభిమానము వదలి, భక్తి, జ్ఞాన ప్రపత్తుల అవలంబించి, వైరాగ్య భావనతో, పరతత్వ సాధనలో శాశ్వతానందము బడయుము. శరణాగతితో శ్రీహరి చరణ కమలములు కోరి శాంతి నొందుము.

శ్లోకం - 5

యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||

శ్లోకం అర్ధం : ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు. 

తాత్పర్యము : నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున, నీ భార్యా బిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరు నిన్ను అతి మర్యాదగ చూతురు. సేవకులు, సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప కాదు, నీవల్ల వారికి జెరిగే ప్రయోజనమో, లేదా నీవల్ల వారికి హాని జెరుగకుండయుండు నటుల వారు అలా నటింతురు. ఒక్కసారి ఆ పదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగానే, నిన్ను ఎవరూ పట్టించుకొనరు. ఇంటా, బయటా నీకు గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగుతుంది. కనుక తెలివిగా ఇప్పుడే కనులు తెరిచి, ప్రేమ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణామూర్తి అయిన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలెనన్న, ఈ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ చేసుకొనుము.