Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 21

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

శ్లోకం అర్ధం : మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము. 

తాత్పర్యము : ఈ సంసార సాగరములో చిక్కి, మాయా మొహమను అంధకార బద్ధులైన మనకు పుట్టుట, చచ్చుట, మరల తల్లి గర్భమందు తొమ్మిది నెలలు వాసము జేయుట అను సుడిగుండములో జన్మలకు జన్మలు గడుపుచున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగారమునుండి వెలువడు మార్గము కానక కడు శోకచిత్తులమైన మనకు శ్రీహరి పాదారవిందములు తప్ప అన్య మార్గము లేదు. మన ప్రయత్నముగా కడు భక్తితో హరిని ధ్యానించుచు, జ్ఞాన, వైరాగ్య, సాధనలతో తత్వమునెరిగి, శరణాగతితో హరి కరుణకు ప్రాప్తులము కావలెను. అంతకు మించి ఈ మాయను ఛేదించి, జనన మరణ సుడిగుండము నుండి బయటపడు మార్గము వేరు లేదు. జ్ఞాన, వైరాగ్యములు తత్వ సాధనకు సరియగు మార్గమును తెలుపును, కాని వాటి వలన మాత్రమే మోక్ష ప్రాప్తి చేకూరదు. మోక్ష ప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే! దానికి అనువైన సాధనము భక్తి. శరణాగతితో కూడిన భక్తితో భగవంతుని కరుణ పొందవచ్చును. ఒక్కసారి పరమాత్ముని దయ కలిగినచో మోక్షము ముంగిలిలో పువ్వులా చాలా సులభమగును.

No comments:

Post a Comment