Pages

Sunday, August 22, 2010

శ్లోకం - 1

భజగోవిన్దం భజగోవిన్దం
గోవిన్దం భజమూఢమతే|
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే||

శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

తాత్పర్యము : పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము, ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము. హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం. ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిదురించు చున్నా, క్రీడించు చున్నా మనసున హరి ధ్యానమును మరువకుడు.

శ్లోకం - 2

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||

శ్లోకం అర్ధం : ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

తాత్పర్యము : హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు కదా, ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మలవల్ల పాపపు మాటలు పెరిగి, అవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఎంతమందో కాలగర్భంలో కలిసి పోయారు. వారి పేర్లు, ఊర్లు కూడా ఎవరికీ తెలియదు. మరి త్యాగధనులు, భగవంతుడి భక్తుల పేర్లో, అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగులుట లేదా? కండ, అండ, ధన, మద బలంతో, మంచివారిని అణగ ద్రొక్కి, అధికార పగ్గాలు చేతబట్టి, అరాచకాలు సృష్టిస్తూ, ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో, అదే రీతిలో అకాల మరణాల పాలై, ఎంత దైన్యస్థితి నొందుచున్నారో! బ్రతికి ఉన్నా వారికి శాంతి లేదు, ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జెరుగుతుందో అని ప్రతిక్షణము భయపడుతూ బ్రతుకుతారు, అత్యంత హీనమైన చావు చస్తారు. కనుక, సంపాదనకు సమయము వృధా చేయక, హరి ధ్యానము పై మనసును మళ్ళించుము.

శ్లోకం - 3

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||

శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

తాత్పర్యము : స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. అందాలు అనుకొనే ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.

శ్లోకం - 4

నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||

శ్లోకం అర్ధం : తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

తాత్పర్యము : నావి అని భావించు ఈ బాహ్య వస్తువులే కాదు, ఈ శరీరము కూడా మన సొంతము కాదు. ఒక్క క్షణములో అవి మనలను వదిలి పోవును. తామరాకుపై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైనా అది జారిపోవును, నీటి బుడగలా రాలి పోవును. కనుక ఈ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక పడుట, ఎండమావుల వెనుక పడి దాహము తీర్చుకొన ప్రయత్నించిన దానితో సమానము. అందుకే పామరులు బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అనుబంధమును ఏర్పరుచుకొని, అవి ఉన్నంత వరకు సంతోషము, అవి దూరమైనప్పుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కావున, వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న దేహాభిమానము వదలి, భక్తి, జ్ఞాన ప్రపత్తుల అవలంబించి, వైరాగ్య భావనతో, పరతత్వ సాధనలో శాశ్వతానందము బడయుము. శరణాగతితో శ్రీహరి చరణ కమలములు కోరి శాంతి నొందుము.

శ్లోకం - 5

యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||

శ్లోకం అర్ధం : ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు. 

తాత్పర్యము : నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున, నీ భార్యా బిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరు నిన్ను అతి మర్యాదగ చూతురు. సేవకులు, సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప కాదు, నీవల్ల వారికి జెరిగే ప్రయోజనమో, లేదా నీవల్ల వారికి హాని జెరుగకుండయుండు నటుల వారు అలా నటింతురు. ఒక్కసారి ఆ పదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగానే, నిన్ను ఎవరూ పట్టించుకొనరు. ఇంటా, బయటా నీకు గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగుతుంది. కనుక తెలివిగా ఇప్పుడే కనులు తెరిచి, ప్రేమ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణామూర్తి అయిన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలెనన్న, ఈ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ చేసుకొనుము.

శ్లోకం - 6

యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే||

శ్లోకం అర్ధం : శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

తాత్పర్యము : శరీరంలో యీహంస సాగిన వరకే బంధువులు, మిత్రులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాస నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరుటకు భయపడును. నీవారందరూ నీ శరీరమును తాకుటకు కూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొన్ని క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో, రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగానే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదిలించుకొందామా అని అందరూ భావింతురు. పంచ భూతములతో నిర్మితమైన ఈ దేహం, చివరకు ఈ పంచ భూతములలోనే కలిసి పోవలె. అట్టి ఈ హీన శరీరం పై మమతలు ఏల? 

శ్లోకం - 7

బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||

శ్లోకం అర్ధం : బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

తాత్పర్యము : బాల్యములో, తెలిసీ తెలియని వయసులో సమయమునంతా ఆట పాటలకు వ్యర్థము చేసుకోనుచున్నాము. పిమ్మట యుక్త వయస్సు రాగానే, స్త్రీ వ్యామోహములో పడి కామ-క్రీడలకు సమయము వృధా చేయుచున్నాము. ఆ పిమ్మట వృద్ధాప్యములో ధన, కాంత, కనకాల మీద ఆశ తీరక జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము. ఇంక భగవంతునిపై తలపు ఎప్పుడు? జీవితకాలమంతా యిటుల వృధా అయిన సాధించినది ఏమి? కావున కర్తవ్యము నెరిగి, పరమాత్మునిపై మనస్సు నిలిపి, గోవింద స్మరణతో జీవితము పునీతము చేసుకొనుము. ఆత్మ నిగ్రహముతో, పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము. నేడు, రేపు అని రోజులు గడుపకుము. మానవ జన్మము మహాదుర్లభము, భగవంతుని చేరుటకు సదవకాశము. ఇది చేజార్చుకొనకుము.

శ్లోకం - 8

కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః|
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః||

శ్లోకం అర్ధం : ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.

తాత్పర్యము : ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.

శ్లోకం - 9

సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||

శ్లోకం అర్ధం : జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును. 

తాత్పర్యము : సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలుచును. దాని ఫలితముగ నీకు ముక్తి చేకూరును. కావున సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన, ఆ సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్యములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.

శ్లోకం - 10

వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః|
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః||

శ్లోకం అర్ధం : వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?

తాత్పర్యము : తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి? దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడలపై ఆసక్తి నశించుట సహజము. నీరన్నియు ఎండిపోయిన పిమ్మట యిక చెరువనేది ఎక్కడ? అనగా, శక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి? వయసులో ఉన్నప్పుడు, మనో వికారములను అదుపు చేసి పరమాత్మునిపై లగ్నము చేసినవాడు గొప్పవాడు. అనగా, ఎప్పుడో వృద్ధాప్యములో అన్ని అంగములు ఊడినపుడు, వాటిపై అయిష్టత గలిగినను, మనసు మాత్రము ఇంకా వాటి వెనుకే పరుగులిడుచుండును. వయసులో ఉన్నప్పుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో ఉండి, ఏకాగ్రత చేకూరును. కావున భగవత్ చింతన పిన్న వయసు నుండే ప్రారంభించవలెను.

శ్లోకం - 11

మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం|
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||

శ్లోకం అర్ధం : ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

తాత్పర్యము : ఈ ప్రపంచములో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో, అందగాడిననో, పదవిలోనో- పలుకుబడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోచ్ఛారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, స్త్రీ, జ్ఞాన, వృద్ధులు అన్న తారతమ్యములు మరిచి, అందరినీ అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. కావున గర్వమును సంపూర్ణముగా నశింప చేసి, పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమ పదము సాధించుము.

శ్లోకం - 12

దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః||

శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

తాత్పర్యము : మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు. అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించు చున్నాము. ఈ విధంగా మన జీవితకాల మంతయు గడిచి పోవుచున్నది. స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో కాలయాపన చేయుచున్నాము. ఈ విధంగా గంటలు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడిచి పోవుచున్నవే కాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడిచినవి, గడచును కూడా! మానవ జన్మము బహు దుర్లభమైనది. అది చేజారిన మరల దొరుకుట కష్టము. కావున, ఉన్న సమయమునైనా భగవత్ చింతనలో గడిపి, జీవితము సఫలము చేసుకొనుము. 

శ్లోకం - 13

కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా||

శ్లోకం అర్ధం : ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

తాత్పర్యము : ఓయీ ! పరాత్పరుడైన భగవంతుడు లేడా? అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా? పుట్టించినవాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్నా నా భార్యా-బిడ్డల గతి ఏమిటని చింతించకుము. దయా స్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి, గుడ్డ, నీడ తప్పక ఇచ్చును. కావున ఈ విషయముల మీద చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము చేయుము. సమయమును వృధా చేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము.

శ్లోకం - 14

జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః|
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః||

శ్లోకం అర్ధం : జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.

తాత్పర్యము : వేష, బాషలు భక్తి, జ్ఞానమునకు కొలమానములు కావు. బోడి తల చేసుకొని, నామములు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాడు. బాహ్య వేషములు మోసమునకే కాని, మోక్షము సాధించుటకు పనికిరావు. జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేద మంత్రములు పఠించుచుండి, మనసు భగవంతునిపై లగ్నము కానప్పుడు ఆ పూజలు నిరర్ధకము. పరమార్ధము తెలుసుకొనలేని వ్యక్తి ఏ వేషము వేసినను వ్యర్ధమే. జ్ఞాని మనో వాక్కాయ కర్మలు భగవంతునిపై లగ్నము చేయును. అట్టి మహోన్నతుడు సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణ సంపన్నుడై ఉండును. సాటి వారిపై తను అతి కరుణతో ప్రవర్తించును. కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనునవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగా ఉందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించెదము.

Saturday, August 21, 2010

శ్లోకం - 15

అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం|
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం||

శ్లోకం అర్ధం : శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు. 

తాత్పర్యము : తల వెంట్రుకలు నెరసినను, చర్మము ముడతలు పడ్డను, నడుము వొంగి వృద్దాప్యముతో కర్ర పట్టుకుని నడుచు చున్ననూ, మనసులో మార్పు రానిదే ఆశలు వదలవు. అనగా, శరీరము మార్పులు చెందినను, మనిషి ఆలోచనా విధానము మారనంత వరకు అజ్ఞానము, మోహము వదలవు. మనసు మారనంతవరకు ' ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండునన్నట్లు ' బుద్ధి అరిషడ్వర్గ భూయిష్టమై, ఆశా మోహముల అడుసులో నానాటికి మునిగి పోవుచూ, పరతత్వానికి దూరమగుచుండును. కావున మానసిక సాధన ద్వారా అట్టి దుష్ట బుద్ధులను లొంగ తీసుకొని, కోరికలకు కళ్ళెం వేసి, ఏకాగ్రతను సాధించి, పరబ్రహ్మను మదిలో ప్రతిష్టాపించి ముముక్షువులు కావలెను.

శ్లోకం - 16

అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః|
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః||

శ్లోకం అర్ధం : తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు. 

తాత్పర్యము : మొక్షాసక్తులు వదలవలసినది వాసనలు, వ్యామోహము, ఆశలు కాని వస్తు సముదాయములు కాదు. భౌతిక వస్తువులు త్యాగము చేసినంత మాత్రమున మోక్షప్రాప్తి జెరగదు. కొందరు ఇళ్ళు వదలి, బైరాగులై, భిక్షాటనతో పొట్ట గడుపుకొనుచు, ఏ చెట్టు కిందనో జీవించుచు, చలి, ఎండ, వానలు భరిస్తూ మోక్షము వచ్చునని కలలుగందురు. కాని బాహ్య వస్తువులు, సుఖముల నన్నిటిని త్యాగము చేసినా, వారు మనసుకు పట్టిన ఆశ, అరిషడ్వర్గములు, మానసిక దోషములు, కోపతాపములు, వాసనలు వదులు కొనలేక పోవుచున్నారు. ఆ కారణము వలననే వారికి మోక్షము గగన కుసుమము అగును. మనసు మాధవునిపై లగ్నము చేయక, కేవలము పెద్దగా సంస్కృత మంత్ర పఠనము, ఆడంబరమైన పూజలు, గుళ్ళ యందు అర్చనలు, అభిషేకములు, వ్రతములు, ఉపాసనలు, భగవత్ గీత, భాగవత పఠనలు మొదలగు బాహ్య కార్యకలాపములు చేయుచూ, తాము భక్తులమని, గురువుల మని, అందరికన్నా ఉత్తములమన్న భ్రమలో పడి మోక్ష ప్రాప్తిని ఆశింతురు. కాని భగవంతునిపై ఏకాగ్రత, స్థిర చిత్తము లేక ఈ కార్యకలాపములు కేవలము నటనలుగనే కాని, మానవుని బంధ విముక్తుడిని చేయలేవు. మనసు మాధవునిపై స్థిరముగా లేక వెయ్యి సార్లు విష్ణు సహస్రనామ పఠనము కన్నా, ఒక్కసారి భక్తిగా మనస్సు పెట్టి గోవిందా అని తలపోసిన గొప్ప ఫలితము దక్కును. కావున బాహ్య ఆడంబరములు కన్నా, వస్తు త్యాగములు కన్నా దుర్వ్యసనా త్యాగము, హృదయ స్థిరత్వము మోక్షదాయకములగును.

శ్లోకం - 17

కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం|
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన||

శ్లోకం అర్ధం : గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.

తాత్పర్యము : బాహ్యకర్మల వలన జ్ఞానము కాని, మోక్షప్రాప్తి కాని కలగదు. మడి, ఆచారములు, మంత్ర పఠనములు మున్నగు కార్యములు చేసినంత మాత్రముననే జ్ఞానము చేకూరదు. జీవుడు తాను ఆత్మరూపుడనని, ఈ జడ దేహము కాదని ఎరిగి నడుచుకోనంత వరకు ఈ బాహ్యకర్మలు కేవలము ఆటోపములే కాని ఫలిత శూన్యములు. పవిత్ర నదులలో స్నానము చేయుట, తీర్ధయాత్రలు తిరుగుట, దానములు చేయుట, వ్రతములను ఆచరించుట మొదలగునవి అవసరమే కాని కేవలము అవి ఆచరించినంత మాత్రముననే మోక్షము కలగదు. ఈ కార్యములన్నిటి పరమార్ధము చిత్తశుద్ధిని పొందుట, తద్వారా ఆత్మజ్ఞానము బడసి పరమాత్మకు చేరువగుట. ఈ బాహ్య కార్యములన్నీ ఉపకరణములు మాత్రమేకాని, అవే గమ్యములు, పరమార్ధములు కావు. గమ్యము గోవిందుని చరణారవిందములే!

శ్లోకం - 18

సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః|
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః||

శ్లోకం అర్ధం : దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు? 

తాత్పర్యము : శుద్ధ మనస్కులై, ఆశా పాశములు విడనాడి, ఏకాగ్ర చిత్తముతో హరి ధ్యానములో గడుపుచూ, వస్తు త్యాగము చేసి, భూతల శయనముతో, సాధారణ వస్త్రములతో జీవించునో వానికి మోక్షప్రాప్తి తధ్యము. ఆత్మ శుద్ధితో, దైవ చింతనతో, వస్తు విరాగులై, వైరాగ్య కామకులై, సుఖ సంతోష మనస్కుడైన వ్యక్తి, పరిపూర్ణతను పొంది, కైవల్య ప్రాప్తినొందును. మనస్సును బాహ్యవస్తువుల నుండి మరల్చి, అంతరంగమును అంతర్ముఖముగా మరల్చి ఆత్మచింతన చేయువారికి మొహోత్తర ఆనందము సమకూరును. మానవునికి అట్టి ఆత్మ సుఖము బడయుటే జీవిత గమ్యము గావలెను. వైరాగ్యము, ఆత్మచింతన అనునవి పరమ సుఖానికి ముఖ్య కారణములై ఉన్నవి. కావున సంపూర్ణ, అత్యంత సుఖమును అనుభవించ వలెనన్న, వైరాగ్యమును ఆశ్రయించక తప్పదు.

శ్లోకం - 19

యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః|
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ||

శ్లోకం అర్ధం : యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.

తాత్పర్యము : ఆత్మజ్ఞానముతో పరబ్రహ్మ స్వరూపము నెరిగిన వ్యక్తికి ఎచ్చట ఉన్ననూ, ఎప్పుడైననూ, హృదయములో సంపూర్ణ ఆనందము నిండి ఉండును. అట్టి ఆనందము సంసారిక సుఖముల వల్ల ఎన్నటికీ లభించదు. వస్తు విషయముల వల్ల వచ్చు ఆనందము అసంపూర్ణము, అనిత్యము. కాని పరతత్వ జ్ఞానము వల్ల లభించిన ఆనందము పరిపూర్ణము, నిత్యము. అట్టి ఆనందము పొందు వ్యక్తి యోగ యుక్తుడుగా ఉండినను, భోగ యుక్తుడుగా ఉండినను, లేక సంసార బంధములలో కూరుకుని ఉండినను ఆ ఆనందమును పొందుచునే ఉండును. అనగా, తామరాకు మీద నీటి లాగ తాను ఎచ్చట ఉండిననూ, వానితో మనసు ముడి పెట్టుకొని ఉండక, తన కర్తవ్యము తాన నిర్వర్తించుచూ, మనస్సును భగవంతునిపై లగ్నము చేసి ఆ తన్మయత్వములో పరమానంద భరితుడై ఉండును. 

శ్లోకం - 20

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

శ్లోకం అర్ధం : భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.

తాత్పర్యము : భగవత్ గీత కొంచెమైననూ పఠించిననూ, గంగా జలము కొంచెము గొంతున త్రాగినను, భక్తితో భగవన్నామము ఒకపరి పలికిననూ, యముడు కూడా వాని జోలికి పోడు. సత్కార్యములు చేయుచూ, మనసు మాధవునిపై లగ్నము చేసి జీవించు సాధువుకు ఎవ్వరూ కీడు చేయలేరు. త్రికరణ శుద్ధిగా, అనగా మనసా, వాచా, కర్మణా, భగవంతునిపై మనసు నిల్పి, సత్కార్యము ఆచరించుచూ బ్రతుకు వ్యక్తికి మోక్ష ప్రాప్తి తధ్యము.